తాతమ్మ మనవడి ,నుంచి జై సింహ వరకూ.. వంద సినిమాలు దాటినా అణుమాత్రం తగ్గని బాలయ్య క్రేజ్ ..ఎందుకు?

Nandamuri Balakrishna Birthday Special

Nandamuri Balakrishna Birthday Special

వందేళ్ళకి దగ్గర పడ్డ తెలుగు సినిమా ఎందరో అద్భుత కథానాయకులని చూసింది,అలనాడు స్వర్గీయ మహానటులు ఎన్ టీ ఆర్ ,ఏ ఎన్ ఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్ టీ ఆర్ ,రామ్ చరణ్ ,విజయ్ దేవరకొండ వరకూ ఎందరో ప్రేక్షకులని తమ నటనతో మెప్పించి శభాష్ అనిపించుకున్నారు..

అయితే అలనాటి మేటినటులకి ,నేటి తరపు యువ నటులకి మధ్యలో ఉన్న ఒక తరంలో ఉన్న కథానాయకుడు ఎప్పటికీ ప్రత్యేకమే,నాలుగు దశాబ్దాలు పైగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ,సాంఘికం,పౌరాణికం,జానపదం,చరిత్రాత్మకం ఇలా పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేసిన కథానాయకుడు నేటి తరానికి నందమూరి బాలకృష్ణ (అభిమానులకి బాలయ్య) మాత్రమే..


ఎప్పుడో 44 ఏళ్ళ నాడు తండ్రి చాటు బిడ్డగా “తాతమ్మ కల” తో సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య ఆ తర్వాత సోలో హీరో గా హిట్ అందుకోవడానికి మాత్రం దాదాపు పదేళ్లు పట్టింది.. అయితే ఆ హిట్ మాత్రం అలంటి ఇలాంటి హిట్ కాదు,సినీ కలెక్షన్స్ లో ఒక తుఫాను.. సంవత్సరం పైగా ప్రదర్శితమైన భారీ హిట్ “మంగమ్మ గారి మనువడు”..

ఆ తర్వాత ఇక మరి వెనక్కి తిరిగి చూడలేదు బాలయ్య,ముద్దుల మామయ్య గా మళ్ళీ మరో భారీ హిట్ ,ఒక చెల్లి కోసం,ఆమె కొడుకు కోసం ప్రాణాలకి తెగించి పోరాడే సన్నివేశాల్లో శభాష్ అనిపించుకున్నారు బాలయ్య…ఇక మాస్ చిత్రాల హవా మొదలైన 90 వ దశకంలో అయన చేసిన “నారి నారి నడుమ మురారి”,”లారీ డ్రైవర్” రెండూ సంచలనాలే.. నారీ నారీ లో బాలయ్య అల్లరి బావ గా వినోదం పంచితే ,లారీ డ్రైవర్ లో అన్యాయం సహించలేని డ్రైవర్ గా ఈలలు వేయించాడు..

ఇక 1991 లో అయన సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో చేసిన “ఆదిత్య 369” తెలుగులో వచ్చిన మొదటి scifi చిత్రంగా చెప్పవచ్చు.. ఒకే సినిమా లో శ్రీ కృష్ణ దేవరాయల 15 వ శతాబ్దానికి,చివర్లో 2050 వ సంవత్సరానికి కూడా ప్రేక్షకులని తీస్కుని వెళ్లి మంత్రముగ్దుల్ని చేసారు బాలయ్య..

ఇక ఒకే ఏడాది పోలీస్ గా(రౌడీ ఇన్స్పెక్టర్), లాయర్ గా(ధర్మ క్షేత్రం) లో కూడా హిట్లతో అలరించారు.. ఆ తర్వాత కార్మిక నాయకుడిగా నిప్పురవ్వ లో ,పల్లెటూరి బుల్లోడుగా బంగారు బుల్లోడు లో ఇలా విభిన్న పాత్రలతో అలరించారు బాలయ్య..


ధర్మం కోసం పోరాడే ఊరి పెద్ద విజయరాఘవ భూపతిగా “బొబ్బిలి సింహం”,ఎప్పుడో ఎన్ టీ ఆర్ ,కాంతారావు ల తర్వాత మళ్ళీ “భైరవ ద్వీపం” చిత్రంతో 90 వ దశకం లో జానపద చిత్రం తో మంత్రముగ్ధుల్ని చేశారు బాలయ్య.. ఈ చిత్రం కోసం ఒక “కురూపి” పాత్ర కూడా చేసారు బాలయ్య,ఆ పాత్ర దాదాపుగా మంచి ఫామ్ లో ఉన్న హీరో చేయడం పెద్ద సహాసమే..

ఇక ఒక కుటుంబానికి జరిగిన అన్యాయానికి వారికి పెద్దకొడుకుగా మారే పాత్రలో “వంశానికికొక్కడు”,మొదటిసారి తండ్రి బాటలో శ్రీ కృష్ణుడి పాత్రలో “శ్రీ కృష్ణార్జున యుద్ధం” కూడా విభిన్న చిత్రాలే..
అయితే మంచి మాస్ హీరో గా రన్నింగ్ లో ఉన్న సమయంలో ,మధ్యవయస్కుడు రామకృష్ణ ప్రసాద్ పాత్రలో అయన చేసిన “పెద్దన్నయ్య” సినిమా ఒక సంచలనం.. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో అప్పటి అగ్ర హీరోలు వెంకటేష్ ,చిరంజీవి కూడా ఆ పాత్రల పోషణకి ఆసక్తి చూపించడం గమనార్హం

ఇక చెల్లెలి ప్రేమ కోసం తపించే మాఫియా డాన్ పాత్రలో “రాణా”,ఇంకా పూట కి ఒక వేషం మార్చేసే టెర్ర్రరిస్టు పాత్రలో “సుల్తాన్” ఇలా ఒకటేమిటి ప్రతి పాత్ర ప్రత్యేకమే.. అయితే బాలయ్య కి సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చిత్రం మాత్రం “సమరసింహారెడ్డి” అని చెప్పాలి,ఆ చిత్రంలో తన వల్ల అనాధలుగా మారిన తన నమ్మిన బంటు చెల్లెలని కాపాడి,ఫ్యాక్షనిజం అంతానికి కృషి చేసే పాత్రలో బాలయ్య నటన అనన్యసామాన్యం.. అప్పటి ఫ్యాక్షన్ చిత్రాల్లో అదొక ట్రెండ్ సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు..

ఇక ఇదే తరహా లో వచ్చిన నరసింహనాయుడు,సీమ సింహం,చెన్న కేశవ రెడ్డి, ఇలా వరుస ఫ్యాక్షన్ కథలతో కూడా హిట్ కొట్టారు బాలయ్య.. ఇక సామి చిత్రానికి రీమేక్ గా 2004 లో వచ్చిన లక్ష్మి నరసింహ లో డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చే పోలీస్ అధికారిగా బాలయ్య మరోసారి నటవిశ్వరూపం చూపించారు.. అయితే ఈ సినిమా తర్వాత వరుసగా 6 ఏళ్ళు ,7 అపజయాలు కూడా మూటగట్టుకున్నారు బాలయ్య..

వరుస ఫ్లాపులతో ఇక బాలయ్య పని అయిపోయింది అని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసిన వారి నోళ్లు మూయిస్తూ 2010 తో “సింహ” తో భారీ హిట్ కొట్టి సరైన కథ పడితే తన సత్తా ఇది అని మరోసారి చాటారు.. ఇక ఆ తర్వాత మొదటిసారి తన తండ్రి లవకుశ చిత్రానికి రీమేక్ గా వచ్చిన “శ్రీ రామరాజ్యం” చిత్రం తో రాముని పాత్రపోషించి శభాష్ అనిపించుకున్నారు..

2014 లో మరోసారి బోయపాటి తో లెజెండ్ అంటూ మరో సూపర్ హిట్ కొట్టి,తన జైత్రయాత్ర కి తిరుగులేదనిపించుకున్నారు.. ఇక తెలుగు తెర పై ఎవ్వరూ స్పృశించని తెలుగు జాతి చక్రవర్తి “గౌతమీ పుత్ర శాతకర్ణి”లాంటి చారిత్రాత్మక చిత్రం తో సూపర్ హిట్ ఇచ్చి,ఆ పాత్ర తాను మాత్రమే చేయగలరు అని నిరూపించుకున్నారు బాలయ్య..

ఇక ఈ ఏడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఒక సాధారణ చిత్రం “జై సింహ” లో కూడా తన అమోఘమైన నటనతో హిట్ స్థాయి కి తీసుకొచ్చారు బాలయ్య.. ఇప్పుడు ఆయన వయసు 58 ఏళ్ళు ,ఇప్పటికీ ఏడాది కి రెండు సినిమాలు పైగానే చేస్తూ యువ హీరోలకి మంచి పోటీ ఇస్తున్నారు.. తాజాగా అయన తన తండ్రి లెజెండ్ ఎన్ టీ ఆర్ జీవిత కథని సినిమాగా తెరకెక్కించే పనిలో ఉన్నారు..
ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ,నటుడిగా అలరిస్తూ,ఒక ప్రక్క కాన్సర్ బాధితులకి కూడా అండగా నిలుస్తున్న మన బాలయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో భారీ భారీ హిట్స్ తో జరుపుకోవాలని ఆశిద్దాం .. జై బాలయ్య..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *